మూలస్థానేశ్వరాలయంలో భిన్నమైన నంది విగ్రహం తొలగింపు: త్వరలోనే నూతన నందీశ్వరుడి ప్రతిష్ఠాపన
నెల్లూరు కల్చరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని చారిత్రక మూలాపేట శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర దేవస్థానంలో కొలువై ఉన్న సహస్ర లింగేశ్వర స్వామి వారి ఎదుట ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని అధికారులు శాస్త్రోక్తంగా తొలగించారు. నంది విగ్రహం చెవులు భిన్నం కావడంతో (దెబ్బతినడంతో), ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ఆ విగ్రహాన్ని మార్చి, నూతన నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు దేవస్థాన పాలకమండలి ఉన్నతాధికారుల అనుమతి కోరింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 9 గంటలకు శుభముహూర్తంలో పాత విగ్రహాన్ని తొలగించి, నూతన విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు చేపట్టారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్, ఉన్నతాధికారులు, ఒకటవ టౌన్ ఎస్ఐ, శిల్పకళా స్థపతి ఇన్‌స్పెక్టర్, అలాగే ఆర్డీవో కార్యాలయ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. భిన్నమైన నందీశ్వరుడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా తొలగించి భద్రపరిచారు. త్వరలోనే శాస్త్రోక్తంగా హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన నంది ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ వెంకట అజయ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. నూతన విగ్రహ ప్రతిష్ఠాపన తేదీ వివరాలను త్వరలోనే భక్తులకు వెల్లడిస్తామని ఆలయ వర్గాలు తెలిపాయి.