మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని, బీజేపీ జిల్లా నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్ నలిశెట్టి శ్రీనివాసులు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : నెల్లూరులోని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆయన స్వగృహంలో ఆత్మకూరు మున్సిపాలిటీ మూడవ వార్డు నుంచి ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి నలిశెట్టి శ్రీనివాసులు తో కలిసి బీజేపీ, కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా నలిశెట్టి శ్రీనివాసులును ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల సమయంలో మూడవ వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి, స్వయంగా వార్డుకు వచ్చి ప్రచారంలో పాల్గొనడం తమ విజయానికి ఎంతో దోహదపడిందని నలిశెట్టి శ్రీనివాసులు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మంత్రి సహకారంతో, కూటమి నాయకులందరితో కలిసి ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి నాయకులందరూ సమన్వయంతో, ఐకమత్యంతో ముందుకు సాగుతూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ నలిశెట్టి శ్రీనివాసులు తన వార్డు అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయిస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజల మన్ననలు పొందుతూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
బిజెపి కార్యాలయం లో
అనంతరం నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ని, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కూడా మూడవ వార్డు నుంచి విజయం సాధించిన నలిశెట్టి శ్రీనివాసులు ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ప్రజలకు నిబద్ధతతో సేవలందించి, తన వార్డును అభివృద్ధి చేస్తూ భారతీయ జనతా పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, నలిశెట్టి జగదీశ్వర రావు,కూటమి నాయకులు పాల్గొన్నారు.