పరిగి డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి: టిజెఎమ్‌యు
యూనియన్ ఎన్నికల్లో పక్షపాత వైఖరిపై టిజెఎమ్‌యు ఆగ్రహం..
తప్పు ఎవరు చేసినా చర్యలు ఒకేలా ఉండాలన్న హనుమంతు ముదిరాజ్!
సూర్య స్టేట్ డెస్క్: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పరిగి డిపో మేనేజర్‌పై యాజమాన్యం వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టిజెఎమ్‌యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. గత నెలలో జరిగిన ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రక్రియలో పరిగి డీఎం ఒక ఏజెంట్‌లా ప్రవర్తించారని, కౌంటింగ్ హాలులో స్వయంగా కూర్చుని కార్మికులను ప్రభావితం చేస్తూ ఫలానా వారికి ఓటు వేయాలని ఆదేశించారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశం కల్పించాల్సి ఉండగా, సదరు అభ్యర్థిని లోపలికి అనుమతించకుండా డిపో మేనేజర్ అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఈ అక్రమాలు మరియు అధికార దుర్వినియోగంపై సాక్ష్యాధారాలతో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు పరిగి డిపో మేనేజర్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం దారుణమని హనుమంతు ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి పొరపాటు జరిగితే కార్మికులపై కఠినంగా వ్యవహరించే యాజమాన్యం, నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన ఉన్నతాధికారుల పట్ల మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం పక్షపాత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. అధికారులకు కొమ్ముకాస్తూ కార్మికులకు అన్యాయం చేసే పద్ధతి సంస్థ మనుగడకు మంచిది కాదని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. తప్పు ఎవరు చేసినా, అది ఉన్నతాధికారి అయినా లేదా సాధారణ కార్మికుడైనా సంస్థ నిబంధనలు మరియు క్రమశిక్షణా చర్యలు అందరికీ ఒకే విధంగా వర్తించాలని హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు. బాధ్యులైన డిపో మేనేజర్‌పై కఠిన చర్యలు తీసుకోకపోతే కార్మికుల తరఫున ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.