ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : విద్యార్థుల ఫీజుల బకాయిలు ఎనిమిది వేల కోట్లు వెంటనే చెల్లించాలని లేకుంటే రాష్ట్రం రణరంగమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూడేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పులు, బంగారం లాంటి భూములు అమ్మి ఎవరికిచ్చారు అని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శనివారం బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో బిసి విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు పర్ల గొర్ల మోడీ రాందేవ్ సమన్వయంతో వందలాదిమంది విద్యార్థులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ ప్రదర్శన అబిడ్స్ నుంచి బషీర్బాగ్ చౌరస్తా వరకు నిర్వహించగా చౌరస్తా లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఇచ్చిన నినాదాలు మారు మోగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.
చదువులు పూర్తయిన ఆరు లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు రాక విదేశాలకు, ఉద్యోగాలకు వెళ్లేందుకు అవకాశం లేక అల్లాడిపోతున్నారని వెల్లడించారు. కోర్టుల తీర్పులు ఉన్న కళాశాలలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయని గుర్తు చేశారు. విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేస్తామనడంలో ముఖ్యమంత్రికి ఉన్న దురుద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పాత పద్ధతిలోనే ఫీజులు ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్రానికి వస్తున్న లక్షల కోట్ల ఆదాయం ఏమవుతుందని ఆగ్రహించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ఫీజులు కట్టే వరకు విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడంలేదని సూచించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వానికి, విద్యార్థుల ఫీజులకు డబ్బులు లేవనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల ఫీజులు పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరి ప్రతి విద్యార్థికి రూ 5 నుంచి 20వేల వరకు స్కాలర్షిప్లను పెంచాలని అన్నారు. ఫీజుల బకాయిలు ఇచ్చేవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదలమని అన్నారు. విద్యార్థుల చదువులను కాపాడేందుకు ముందుంటామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థుల నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు, విద్యార్థి నేతలు సాయిలు యాదవ్, శ్రీను, ఇతర నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు