రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన
మియాపూర్,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.11.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు తాజా మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
.ఎఫ్ సి ఐ వీడియో, ప్రగతి ఎన్‌క్లేవ్, సత్యలక్ష్మీనగర్, అరబిందో, జయప్రకాష్ నారాయణ్ నగర్, అల్లూరి సీతారామరాజు నగర్, నాగార్జున, VSP, శ్రీదేవి ఎన్‌క్లేవ్, మేఘన ఎన్‌క్లేవ్, ప్రశాంత్ నగర్, కృష్ణసాయి ఎన్‌క్లేవ్, హెచ్ ఎమ్ టి స్వర్ణపురి కాలనీలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మోడల్ రోడ్డు, వరద నీటి కాలువలు, పార్కుల అభివృద్ధి, స్మశానవాటిక ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వరద నీటి కాల్వల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతోపాటు స్మశానవాటికలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు