ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, మేజర్ న్యూస్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతిఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు ప్రకాశించడంతో పాటు, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ పరస్పర ప్రేమాభిమానాలు, సోదరభావంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చేలా చూడాలని సూచించారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలగకుండా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళి ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, జిల్లా మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆకాంక్షించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.