ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం ఉదయం పాత యాగశాలలో మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. లోక క్షేమం, సర్వజనుల ఆయురారోగ్య ఐశ్వర్యాలను కాంక్షిస్తూ దేవస్థానం తరఫున నిర్వహించిన ఈ యాగం ఆలయ స్థానాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో సాగింది. యాగం ముగింపు సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం వేద పండితులు వారికి వేదోక్తంగా ఆశీర్వచనాలు పలికి, అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీనివాసరావు, రాఘవరాజు, కళావతి, ప్రత్యేక ఆహ్వానితులు రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.