మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేస్తూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక, నిషేధ, పరిష్కార చట్టం–2013 నిబంధనల ప్రకారం ఈ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా దేవస్థాన సమావేశ మందిరంలో మహిళా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఈవో వి.కె. శీనానాయక్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. మహిళలు తమ సమస్యలను నిస్సంకోచంగా పంచుకునేందుకు వీలుగా దేవస్థానంలోని మహిళా ఉద్యోగులతోనే కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా విధులు నిర్వహించుకోవచ్చని భరోసా ఇచ్చారు. విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే నేరుగా కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దేవస్థాన వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికీ భక్తి, భయం, బాధ్యత అనే మూడు సూత్రాలు ముఖ్యమని, తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, తప్పు చేయడానికి మాత్రమే భయపడాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను మహిళా సిబ్బందికి పరిచయం చేశారు. వందలాది మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్న ఈ పుణ్యక్షేత్రంలో మహిళల హక్కుల పరిరక్షణకు దేవస్థానం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులుగా ఎల్. రమ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) అధ్యక్షురాలిగా, ఎన్.వి. లక్ష్మీ ప్రసన్న (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), వై. హేమ దుర్గాంబ (సూపరింటెండెంట్) సభ్యులుగా, గుంటూరు శేషమోహన్ (సీనియర్ న్యాయ సలహాదారు) బాహ్య సభ్యుడిగా నియమితులయ్యారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.