కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
*--తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు..దొడ్డిపల్లిలో విషాదం*
నవాబుపేట సూర్య న్యూస్: మండల పరిధిలోని దొడ్డిపల్లి గ్రామంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అమ్మ ప్రేమకు దూరమయ్యారు.ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..దొడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామలింగం భార్య రొయ్యల అరుణ (26)కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.జడ్చర్ల పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సావిత్రి,సాయిల దంపతుల కుమార్తె అయిన అరుణకు 2021లో రామలింగంతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.భర్త విధుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో అరుణ పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉండేది.ఇటీవల భర్త ఇంటికి రావడంతో ఆమె కూడా దొడ్డిపల్లికి చేరుకుంది.ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భర్త పని నిమిత్తం జడ్చర్లకు వెళ్లగా,అత్త జంగమ్మ శుభకార్యంలో పాల్గొనేందుకు కిష్టారం గ్రామానికి వెళ్లింది.ఇంట్లో ఇద్దరు చిన్నారులతో ఉన్న అరుణకు ఒక్కసారిగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తాళలేక ఇంట్లోని మరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కుమార్తెకు ఫోన్ చేసిన తల్లి సావిత్రికి చిన్నారులు ఏడుస్తూ ఫోన్ ఎత్తడంతో అనుమానం వచ్చింది.వెంటనే కిష్టారం గ్రామానికి చెందిన సున్నపు హరీష్‌ను దొడ్డిపల్లిలోని ఇంటికి పంపించింది.ఆయన ఇంట్లోకి వెళ్లి చూడగా అరుణ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.మృతురాలి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.