చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు
చిట్టమూరు మేజర్ న్యూస్
చిట్టమూరు మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.జడ్పీటీసీ స్థానాన్ని కూటమి అభ్యర్థి పెళ్లూరు సౌజన్య రెడ్డి కైవసం చేసుకోగా, మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను దక్కించుకుంది.ఈ ఫలితాలతో మండలంలో కూటమి రాజకీయంగా తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది.టీడీపీ విజయం సాధించిన ఎంపీటీసీ స్థానాల్లో బురదగాలి కొత్తపాలెం,చిట్టమూరు, మల్లాం-1,కోగిలి,గుణపాడు, అరవపాలెం,ఈశ్వరవాక,చిల్లమూరు ఉన్నాయి.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాకశిరి,మల్లాం-2,మెట్టు,ఆరూరు స్థానాల్లో విజయం సాధించింది. కూటమి ప్రభుత్వంపై కొంతమేర అసంతృప్తి ఉందన్న ప్రచారం ఎన్నికల సమయంలో వినిపించినప్పటికీ,అది ఓటర్ల తీర్పుపై పెద్దగా ప్రభావం చూపలేదని ఫలితాలు సూచిస్తున్నాయి.ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాల కంటే స్థానిక నాయకత్వం,అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు,ప్రజలతో అనుబంధం, గ్రామస్థాయిలో చేపట్టిన ప్రచారం కూటమి విజయానికి దోహదపడిన అంశాలుగా కనిపిస్తున్నాయి. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లోనూ భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ,మెజారిటీ స్థానాలను కూటమి గెలుచుకోవడం విశేషం.కూటమి నాయకుల సమన్వయం,కార్యకర్తల కృషి, అభ్యర్థుల ప్రచారంలో ప్రజలతో మమేకమైన తీరు విజయానికి బాటలు వేసినట్లు తెలుస్తోంది.అదే సమయంలో వైసీపీ నాలుగు స్థానాలను గెలుచుకోవడం ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీకి ఉన్న స్థానిక మద్దతును తెలియజేస్తోంది.జడ్పీటీసీతో పాటు మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా కూటమికి మండల పరిషత్లో కీలకమైన రాజకీయ బలం లభించింది.ఈ విజయం కూటమి నాయకులు,కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.తెదేపా శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.విజయం సాధించిన అభ్యర్థులకు అధికారికంగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజా సోము, తహసీల్దార్ రామయ్యలు అందజేశారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్