మీ ఓటుతో గెలిచా.. మీ కోసమే పనిచేస్తా!
- 19,740 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
- పామూరు అభివృద్ధికి కృషి చేస్తా
- పామూరు జడ్పీటీసీ బైరెడ్డి జాహ్నవి రెడ్డి
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు జడ్పీటీసీగా 19,740 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం అందించిన పామూరు మండల ప్రజలకు డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై అపారమైన నమ్మకం ఉంచి ఇంతటి ఘన విజయాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ విజయం తన ఒక్కరిదే కాదని తనకు అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమాని, శ్రేయోభిలాషి, ముఖ్యంగా పామూరు మండల ప్రజలందరిదని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రతి గ్రామంలో తనకు లభించిన ఆదరణ ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మరువలేనని తెలిపారు. ప్రజలు తనకు అప్పగించిన జడ్పీటీసీ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ పామూరు మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో భారీ విజయాన్ని అందించిన పామూరు ప్రజల రుణాన్ని నిరంతర ప్రజాసేవతో తీర్చుకుంటానని పామూరు జడ్పీటీసీ డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి తెలిపారు.