కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే అమిలినేని రోడ్ షో.
శెట్టూరు: పసుపు సైనికుల ఉత్సాహం, భారీ జనసందోహం మధ్య శెట్టూరు మండల కేంద్రంలో కూటమి ఎన్నికల ప్రచారం హోరెత్తింది. కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఉరాల రాజేశ్వరి, 12 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శనివారం భారీ రోడ్‌షో నిర్వహించారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షోకు టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేకు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకే వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించారు. మాదిగలు, మాలలు అందరూ అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం నడిచే వారమని, కులాల పేరుతో విభేదాలు సృష్టించే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతనిస్తూ అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో భూమిపూజ చేసి ప్రారంభించిన పనులను 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని, రైతులకు భూసేకరణ పరిహారం కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. శెట్టూరు మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు కేటాయించిన స్థలంలో సచివాలయ నిర్మాణం చేపట్టడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల అనంతరం ఆర్డీఓతో మాట్లాడి ముస్లిం సోదరులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. యాటకల్లు గ్రామంలో నిలిచిపోయిన వాల్మీకి కల్యాణ మండపం నిర్మాణానికి తన సొంత నిధుల నుంచి రూ.15 లక్షలు, ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు సమకూర్చి పనులు పూర్తి చేయించామని వివరించారు. కళ్యాణదుర్గం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకురావడానికి తమ సంస్థ ద్వారా సుమారు రూ.9 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2028 నాటికి నియోజకవర్గంలోని 140 చెరువులను నీటితో నింపడమే లక్ష్యమని, తద్వారా భూగర్భ జలాలు పెరిగి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శెట్టూరు మండలంలోని మాదిగ కుటుంబాలతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ సాక్షిగా జనవరిలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థులైన జడ్పీటీసీ అభ్యర్థి ఉరాల రాజేశ్వరి, ఎంపీటీసీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజలను కోరారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.