కూటమి అభ్యర్ధుల విజయానికి సమష్టి కృషి
కోటబొమ్మాళి, అక్టోబరు 31, మేజర్ న్యూస్:
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తాయని జనసేన నాయకులు స్పష్టం చేశారు. సంతబొమ్మాళి మండలం బొరుబద్ర గ్రామానికి చెందిన జనసేన నాయకుడు వల్లభ శ్రీనివాసరావు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో, పలువురు జనసేన నేతలు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, కూటమి పార్టీల సమన్వయంపై చర్చించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... గత 28 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, జనసేన నాయకులు వల్లభ శ్రీనివాసరావు, వల్లభ రవి, వల్లభ జోగారావు, డి. నవీన్ తదితరులు పాల్గొన్నారు.