ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ అక్రమాలపై, ఏజెంట్ల పై అభ్యర్థులపై వారి దౌర్జన్యాలపై కళ్యాణదుర్గంలో రేపు భారీ నిరసన ర్యాలీ.
కళ్యాణదుర్గం: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అల్లుళ్ల దౌర్జన్యాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో ప్రకటించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ఏజెంట్లపై దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో చోటుచేసుకున్నాయని పేర్కొంటున్న అక్రమాలు, దౌర్జన్యాలపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుంచి ర్యాలీ ప్రారంభమై టీ సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ విగ్రహం వరకు కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తలారి రంగయ్య పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కళ్యాణదుర్గంలో జరగనున్న ఈ నిరసన ర్యాలీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి