బారువ బీచ్ పనుల్లో అలసత్వం వద్దు!
శ్రీకాకుళం-మేజర్ న్యూస్ ప్రతినిధి: సోంపేట మండలంలోని బారువ బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించే శాశ్వత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పర్యాటక, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బీచ్ మౌలిక సదుపాయాల పనుల్లో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికుల కొరతను సాకుగా చూపకుండా పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బ్లూ ఫ్లాగ్ ధ్రువీకరణ దరఖాస్తుకు వీలుగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఫెన్సింగ్ వంటి ప్రాథమిక సదుపాయాలను ప్రమాణాలకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కేవలం ఒకటి రెండు రోజుల కార్యక్రమాలకే పరిమితం కాకుండా స్థిరమైన పర్యాటక కార్యకలాపాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందులో భాగంగా బారువ బీచ్‌లో కయాకింగ్, మత్స్యకారుల పడవలతో బోటింగ్, విశాఖపట్నం సంస్థల సహకారంతో స్కూబా డైవింగ్ సేవలను కనీసం రెండు మూడు నెలల పాటు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే లైట్‌హౌస్, ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రం, సముద్రంలో మునిగిపోయిన చారిత్రక నౌక ప్రాంతాలను కలుపుతూ గైడెడ్ టూర్లను నిర్వహించడంతో పాటు, బీచ్ వెలుపల ఏటీవీ రైడ్స్, హోమ్‌స్టేలు, స్థానిక ఆహార, హస్తకళా దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరిథ రిసార్ట్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బీచ్ నిర్వహణకు ఒక మాజీ సైనికుడిని మేనేజర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. మహేంద్రగిరి బ్యాక్‌వాటర్స్ ప్రాంతంలో బోటింగ్, ఫిషింగ్, కయాకింగ్ కార్యకలాపాలతో పాటు, అక్కడ నిర్మిస్తున్న వంతెన కింది భాగం నుంచి ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రాబోయే రెండు వారాల్లో ప్రతిపాదిత బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు వీలుగా మంజూరైన పనులను, ప్రవేశ మార్గాన్ని తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటక, మత్స్య, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికలు, పనుల పురోగతి నివేదికలతో డిసెంబర్ 4న జరగనున్న తదుపరి సమీక్షా సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.