ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి
మేడ్చల్, మేజర్ న్యూస్ : జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో మేడ్చల్‌లో మతపరమైన కట్టడాల తొలగింపు అంశం వివాదానికి దారితీస్తోంది. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్నాయంటూ దర్గా, మసీదు, ఏడు గుళ్ల ఆలయాన్ని తొలగించాలని జాతీయ రహదారుల అధికారులు నోటీసులు జారీ చేయడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మతపరమైన కట్టడాలను తొలగించే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మల్లారెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రజల మత విశ్వాసాలు, మనోభావాలకు సంబంధించిన ఆలయాలు, మసీదులు, దర్గాలను తొలగించే విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఆయా కట్టడాలను తొలగించాల్సిన పరిస్థితి ఉంటే ముందుగా ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని సూచించారు. అంతేకాకుండా ఆలయాలు, మసీదులు, దర్గాలకు ప్రభుత్వమే ఖర్చు భరించి నూతన నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అభివృద్ధి పనులు ప్రజల ప్రయోజనాల కోసమే చేపడుతున్నప్పటికీ, వాటి వల్ల ఏ వర్గం మతపరమైన మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. బాధిత వర్గాలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు నవీన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.