నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు
*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి*
ఉమ్మడి కర్నూలు, నవంబర్ 28: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన 2027 ప్రవేశ పరీక్ష ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది.శనివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి రెండు జిల్లాల పరిధిలో మొత్తం 6,970 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,379 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,591 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 77.17 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష సజావుగా ముగిసిందని బనవాసి పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ. పద్మావతి తెలిపారు.పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*