రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల
సత్తెనపల్లి, మేజర్ న్యూస్ : రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో రెండో విడతలో 53 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, బెల్లంకొండ మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల విధులకు నియమించిన పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు ఇప్పటికే సిద్ధమయ్యారన్నారు. ఓటు వేసేందుకు అనుమతించే 12 రకాల గుర్తింపు కార్డుల వివరాలను కూడా ప్రజలకు తెలియజేసినట్లు పేర్కొన్నారు.ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయా గ్రామపంచాయతీల పరిధిలోనే ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో లెక్కింపు బల్లలను ఏర్పాటు చేసి, గరిష్ఠంగా సాయంత్రం 7 గంటలలోపు అన్ని గ్రామపంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మొదట పెడుతున్న 80 శాతం పోలింగ్
మొదటి విడత ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో 103 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 80.2 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ వివరించారు. అదే స్ఫూర్తితో రెండో విడతలోనూ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని సదుపాయాలు, ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ఆర్డీవో గోపాలకృష్ణ, పల్నాడు జిల్లా డీపీవో నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, రిసిప్టులు, ఇతర ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. దీంతో సత్తెనపల్లిలో ఎన్నికల సందడి నెలకొంది. అధికారులు ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
గన్నవరం ఏలియ