విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్–2026
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: కొండాపూర్ లోని
విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన ‘ఫ్యూచర్ ఎక్స్–2026’ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ శనివారం ఘనంగా ముగిసింది. నవంబర్ 27, 28 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీఓ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె. వీరబ్రహ్మం హాజరయ్యారు. అగ్ని-III క్షిపణి ప్రాజెక్టులో ఆయన చేసిన కృషితో పాటు పలు నూతన ఆవిష్కరణలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టుల పనితీరును వివరిస్తూ శాస్త్రీయ పరిజ్ఞానం, సృజనాత్మకతను ప్రదర్శించారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు. పోటీల్లో శ్రీ స్వామి నారాయణ స్కూల్ ప్రథమ బహుమతి సాధించగా, విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ఆత్మవిశ్వాసం, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ప్రదర్శన దోహదపడింది.