అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం
రామాయంపేట;అయ్యప్ప స్వామి కోటి నామర్చన కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రానికి శనివారం విచ్చేసిన అద్వైత రథయాత్రకు భక్తులు ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు మంగళహారతులు, సన్నాయి, డప్పుల నడుమ భక్తి కీర్తనలు ఆలపిస్తూ రథయాత్రను ఊరేగింపుగా స్వాగతించారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ.. అద్వైత ఆధ్వర్యంలో డిసెంబర్ 12న హైదరాబాద్‌లో నిర్వహించనున్న కోటి నామార్చన కార్యక్రమంలో భాగంగా రథయాత్ర గ్రామానికి రావడం అయ్యప్ప స్వామి అనుగ్రహంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు ఇతర భక్తులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు.హైదరాబాద్‌లో నిర్వహించనున్న కోటి నామార్చన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలందరిపై అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు, కన్నెస్వాములు, మహిళా భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.