అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం వెల్దుర్తి మండలం రామళ్లకోటలో విషాదం
వెల్దుర్తి, మేజర్ న్యూస్: అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెల్దుర్తి మండలం రామళ్లకోటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కురువ శ్రీరాములు కుమారుడు కురువ రామాంజనేయులు (33) తనకున్న మూడెకరాల పొలంలో పంటల సాగు కోసం అప్పులు చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట చేతికి అందక ఆర్థికంగా చితికిపోయారు. సాగునీటి కోసం పొలంలో మూడు చోట్ల బోర్లు వేయించినా చుక్క నీరు పడకపోవడంతో అప్పులు తడిసిమోపెడయ్యాయి.
దాదాపు రూ.17 లక్షల వరకు అప్పులు పేరుకుపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక రామాంజనేయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 22న పొలంలో పంటలకు పిచికారీ చేసే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్‌సీ) తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ 23వ తేదీ అర్ధరాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్న వయసులోనే ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.