*సమాచార హక్కు చట్టంతో ప్రజలకు ప్రశ్నించే అధికారం*
కోహీర్;సమాచార హక్కు చట్టం–2005 (ఆర్‌టీఐ) ప్రజలకు కల్పించిన ఒక శక్తివంతమైన చట్టబద్ధమైన హక్కు అని జర్నలిస్ట్ అశోక్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు అవినీతిని అరికట్టేందుకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 2005 అక్టోబర్ 12 నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిందని వివరించారు.ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 6(1) ప్రకారం భారతీయ పౌరులెవరైనా ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమాచారం కోరడానికి గల కారణాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల వివరాలు, ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల ఎంపిక, నిధుల కేటాయింపులు, అధికారిక ఉత్తర్వులు, కార్యాలయ రికార్డుల వివరాలను పొందవచ్చని పేర్కొన్నారు.సంబంధిత ప్రజా సమాచార అధికారి (PIO)కి దరఖాస్తు సమర్పించిన తర్వాత సాధారణంగా 30 రోజుల్లో సమాచారం అందించాల్సి ఉంటుందని తెలిపారు. వ్యక్తి ప్రాణం లేదా స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం 48 గంటల్లో అందించాల్సి ఉంటుందన్నారు. సమాచారం అందకపోయినా, అసంపూర్ణ సమాచారం ఇచ్చినా మొదటి అప్పీల్ చేసుకోవచ్చని, అవసరమైతే రాష్ట్ర సమాచార కమిషన్‌ను రెండో అప్పీల్ ద్వారా ఆశ్రయించవచ్చని వివరించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి నిబంధనల ప్రకారం దరఖాస్తు రుసుము మినహాయింపు ఉంటుందని తెలిపారు.ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనులు, ప్రజాధనం వినియోగంపై చట్టబద్ధంగా సమాచారం తెలుసుకోవాలని అశోక్ సూచించారు. సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.