సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం!
సంగారెడ్డి;నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంజీరా డ్యామ్‌ను సందర్శించిన ఆయన హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ లీకేజీని పరిశీలించి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నీరు వృథా కాకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. సొంత జిల్లా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్‌కు నీటి సరఫరాపై చూపుతున్న శ్రద్ధ సంగారెడ్డి ప్రజలపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ముందుగా స్థానిక ప్రజల తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటి సరఫరాపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగూర్ జలాశయంలో ప్రస్తుతం సుమారు 1.9 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, అవి డిసెంబర్ వరకు మాత్రమే సరిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ముందస్తు హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం తగిన ప్రణాళిక రూపొందించలేదని విమర్శించారు.రెండు మున్సిపాలిటీలు, నాలుగు మండలాల ప్రజలకు వారానికి ఒక్కసారి కూడా సక్రమంగా తాగునీరు అందడం లేదని, మరోవైపు బీర్ కంపెనీలకు నీటి సరఫరా కొనసాగుతోందని ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా వస్తున్న సుమారు 50 ఎంఎల్డీ నీటి సరఫరా నిలిచిపోతే నియోజకవర్గం తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.సింగూర్, మంజీరా జలాశయాల్లో పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని, మంజీరా నదిలో అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించాలని కోరారు.ప్రజల గొంతు ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి వాటర్ వార్‌కు కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల తాగునీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, కౌన్సిలర్లు కొత్తపల్లి శ్రీకాంత్, జాఫర్, లాడే మల్లేశం, నాయకులు జీవీ శ్రీనివాస్, కసిని శ్రీకాంత్, విఠల్, మోహన్ సింగ్, పాండు తదితరులు పాల్గొన్నారు.