ఓటుతో అవకాశం ఇవ్వండి.. పనితీరుతో నమ్మకం నిలబెడతా
పామూరు, మేజర్ న్యూస్ : ఓటుతో ఒక్క అవకాశం కల్పించండి పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పామూరు పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ షంసూర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తనకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా షంసూర్ మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచే నమ్మకమే తనకు కొండంత బలమని ఆ నమ్మకానికి తగిన విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పామూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. ఈ నెల 26న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.