ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్
గుంటూరు : జాతీయ స్థాయి ఉపకార వేతన పరీక్ష (ఎన్ ఏంఏంఎస్) పట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు 'ఎన్ ఏంఏంఎస్ 2026 ఫ్రీ ఆన్‌లైన్ ట్రైనింగ్' సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రాండ్ మోడల్ టెస్ట్ విజయవంతమైంది. కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో జరిగిన ఈ పరీక్షకు గుంటూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 360 మంది విద్యార్థులు హాజరయ్యారు.పరీక్ష ముగిసిన వెంటనే తక్షణ మూల్యాంకనం చేసి మార్కులు వెల్లడించడంతో పాటు, అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ కన్వీనర్ కె. సతీష్ మాట్లాడుతూ.. ఆగస్టు నుంచి యూట్యూబ్, వాట్సాప్ ద్వారా రాష్ట్రంలోని 28 జిల్లాల విద్యార్థులకు ఉచితంగా మాట్ , సాట్ ఆన్‌లైన్ తరగతులు, ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 13న జరిగే అసలు పరీక్ష వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ఆన్‌లైన్ శిక్షణకు సహకరించిన ఉపాధ్యాయులు ప్రకాష్, మంగారావు, శ్రీనివాసరావు, శ్రీలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. పరీక్ష నిర్వహణలో సేవలందించిన ఎన్ సీసీ విద్యార్థులు, వివిధ కళాశాలల ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ టి. సాయిరాం, జిల్లా ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ సుధీర్, పాఠశాల హెచ్‌ఎం వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణకు సహకరించిన డీఈఓ డాక్టర్ సలీం భాషాకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్య నాయక్