తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలిః మంత్రి పొన్నం ప్రభాకర్
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గాంధీ భవన్‌లో మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి ఆజ్మత్ హుస్సేన్, సంపత్ కుమార్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సమావేశ వివరాలను వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన బి.ఎం. సందీప్ కుమార్‌కు స్వాగతం పలుకుతూ సమావేశంలో తీర్మానం చేశారు. గత ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీకి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం ఆమోదించారు.
తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించాలని, రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని పీఏసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని కరువు పరిస్థితుల నివారణకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని తీర్మానించింది. 2027 జనగణనలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, జనగణన ప్రశ్నావళిలో ఓబీసీల వివరాలు నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పీఏసీ తీర్మానం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ, ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచాలని సమావేశంలో చర్చించారు. మండల, గ్రామ, పట్టణ, వార్డు స్థాయిలో కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయడంతో పాటు పార్టీ అనుబంధ సంఘాలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర బీజేపీ నేతల తెలంగాణ పర్యటనల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా వారి ఓటు హక్కును పరిరక్షించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని పీఏసీ నిర్ణయించింది. డిసెంబర్ 7వ తేదీతో ప్రజా ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న సభలో తెలంగాణ కాంగ్రెస్ భాగస్వామ్యంపైనా సమావేశంలో చర్చించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్ ప్రశంసించినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే బి.ఎం. సందీప్ కుమార్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించనున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పీఏసీ పిలుపునిచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.