ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను కొనసాగిస్తూ, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన బీఎం సందీప్ కుమార్‌కు స్వాగతం పలుకుతూ, ఆయన నియామకానికి సహకరించిన సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు సాధించిందని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం విజయాలు సాధించామని, ఈ విజయాలకు మీనాక్షి నటరాజన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో వందేళ్ల తర్వాత తొలిసారిగా ఓబీసీ కులగణన నిర్వహించామని సీఎం తెలిపారు. 2027లో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో కూడా ఓబీసీ కులగణన తప్పనిసరిగా చేపట్టాలని పీఏసీ సమావేశం నుంచి తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సూచించారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దూరదృష్టి, ప్రణాళికల వల్లే దేశంలో విద్య, సాగునీటి రంగాలు అభివృద్ధి చెందాయని, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. రైతులు తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేదని, వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు నిరంతర విద్యుత్ అందించి పంటలు ఎండిపోకుండా కాపాడామని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలోనూ కరవు పరిస్థితులు నెలకొన్నాయని సీఎం తెలిపారు. రానున్న ఎనిమిది నెలల పాటు రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందించాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి వస్తుందని చెప్పారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అవసరమని, ఈ నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై కూడా పీఏసీ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా త్వరలోనే పెద్ద కార్యక్రమాన్ని చేపట్టనున్నామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. సంక్రాంతి తరహాలో ఐదు నెలల పాటు ప్రజాబలం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ పని కల్పించడంతో పాటు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఓటు హక్కు తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో నెహ్రూ, మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించడానికి సుమారు 300 సంవత్సరాలు పట్టిందని, కానీ భారతదేశంలో కాంగ్రెస్ నాయకత్వం ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించిందని అన్నారు. 2019లో దేశ జనాభా 130 కోట్లు ఉండగా 91 కోట్ల ఓట్లు ఉన్నాయని, 2024లో జనాభా 140 కోట్లకు పెరిగినా ఓటర్ల సంఖ్య 97.5 కోట్లకు మాత్రమే చేరిందని వివరించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే అవకాశం ఉందని, ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగింపులు జరుగుతున్నాయని విమర్శించారు. వలసల కారణంగా ఈ వర్గాల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఓటు హక్కు కల్పించేందుకు ఉపయోగించిన ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియను ఇప్పుడు ఓట్ల తొలగింపునకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని పేర్కొన్నారు. ఇంటిపేర్లలో స్వల్ప తేడాలు ఉన్నా, ఇతర చిన్నపాటి తప్పులు ఉన్నా యాంత్రికంగా ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), నాయకులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయం వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచే ఓటర్ల జాబితాలను పరిశీలించాలని ఆదేశించారు. బ్రిటిష్ పాలనలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం తరహాలోనే, ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా 'గో బ్యాక్' నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు కోల్పోయినవారు అనే రెండు వర్గాలను సృష్టించే పరిస్థితి ఏర్పడుతోందని, బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పార్టీ కోసం కష్టపడిన అనేక మందికి ఇప్పటికే పదవులు కల్పించామని, భవిష్యత్తులోనూ పార్టీ శ్రేణులకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.