వెట్టిచాకిరీ కార్మికుల గుర్తింపు, విముక్తి, పునరావాసానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్ జిల్లాలో వెట్టిచాకిరీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు బాధిత కార్మికులను గుర్తించి, విముక్తి కల్పించడంతోపాటు వారికి ఆర్థిక సహాయం, పునరావాసం అందించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు.
బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెట్టిచాకిరీ బాధితులకు అందుతున్న ప్రభుత్వ సహాయం, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై సమీక్షించారు.
జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 161 మంది వెట్టిచాకిరీ కార్మికులను గుర్తించి విముక్తి కల్పించినట్లు జిల్లా కార్మిక శాఖ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. వీరిలో 71 మందికి ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. మరో 26 మందికి తాత్కాలికంగా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ప్రాథమిక సహాయం అందించగా, మిగిలిన రూ.15 వేల చొప్పున సహాయం అందించాల్సి ఉందన్నారు. అదేవిధంగా మరో 64 మంది విముక్తి పొందిన కార్మికులకు ఆర్థిక సహాయం అందించాల్సి ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన బాధితులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, సహాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని సూచించారు.
వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని, బాధితులకు అవసరమైన చట్టపరమైన రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. విముక్తి పొందిన కార్మికులు తిరిగి వెట్టిచాకిరీ బారిన పడకుండా వారికి జీవనోపాధి అవకాశాలు కల్పించడం, పునరావాస పథకాల ప్రయోజనాలు అందించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి, బాధితులకు ప్రభుత్వ సహాయంతోపాటు అవసరమైన న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్మిక, రెవెన్యూ, పోలీసు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, బ్యాంకింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధితుల వివరాలను సమగ్రంగా సేకరించి, అర్హత మేరకు వారికి అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, జిల్లా కార్మిక శాఖ అధికారి రాజ్‌కుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి, ఆర్డీవోలు అర్చన, జనార్దన్ రెడ్డి, బన్సీలాల్, కలెక్టరేట్ సి-సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్, షీ టీం ఎస్సై విజయ, సీసీఎస్ సీఐ శంకర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సందడి రవీందర్ రెడ్డి,గర్‌కర్నూల్,రూరల్, సూర్య న్యూస్: