telangana
పాత్రికేయులు లేని సమాజం చీకటిమయం* *-రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం*
Telangana
28 Oct 2026
52 views
: మనిషి కి ప్రాణవాయువు ఎలాగో... సమాజానికి జర్నలిజం, జర్నలిస్టులు కూడా అలాగే అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. సూర్యుడు లేని సమాజం ఏ విధంగా ఉంటుందో జర్నలిస్టులు లేని సమాజం కూడా అదే విధంగా ఉంటుందని అన్నారు.
జర్నలిస్టులు సమాజానికి దిశా నిర్దేశం చేసే వారని, అటువంటి జర్నలిస్టులు నేడు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లి లో గల త్యాగరాయ గాన సభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పలువురు సీనియర్ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పురుషోత్తం మాట్లాడుతూ,పాత్రికేయులు సమాజానికి వెలుతురులాంటి వారని, పాత్రికేయులే లేకపోతే సమాజం చీకటిమయమవు
తుందని అన్నారు.ఒకప్పుడు పత్రికలు, పాత్రికేయులంటే సమాజానికి, ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసే స్థాయిలో ఉండేదని, కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు, పాలకులు జర్నలిస్టులను పావులుగా వాడుకుంటున్నారే తప్ప జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయమై చాలా నిర్లక్ష్యం చేశాయని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం సుముఖంగా ఉన్నారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తనవంతు బాధ్యతగా అన్ని విధాలుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని న్నారు.
మీడియా సంస్థలు, విద్యా, వైద్య సంస్థలు చదువుకున్న వారి చేతిలో లేవని, కేవలం పెట్టుబడిదారుల చేతుల్లో మాత్రమే ఉన్నాయని, అందుకే సమాజంలో ఇటు పత్రికలకు అటు జర్నలిస్టులకు విలువలు లేకుండా పోయాయని విమర్శించారు. గతంలో పత్రికలు నిజాలు మాత్రమే రాసేవని, పత్రికలో అగ్గిపెట్టెంత వార్త వస్తే ఎంతో స్పందన వచ్చేదని, ప్రస్తుతం నిజాలు రాసే పత్రికలు కరువయ్యాయని అన్నారు. సమాజం కోసం నిరంతరం
శ్రమించే జర్నలిస్టులకు సంక్షేమ ప్రయోజనాలు సమకూర్చకపోవడం దారుణమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్క రంగానికి ఏదో ఒక లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించడం చాలా బాధాకరమని అన్నారు. నిరంతరం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో ముందున్న జర్నలిస్టులు తమ సమస్యలను తాము పరిష్కరించుకోవడంలో విఫలమవుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు భూముల్లేవు, జాగలు లేవు, హెల్త్ కార్డులు లేవు, సంక్షేమ పథకాలు లేవని అన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు సంఘటితంగా తమ యూనియన్ల హయాంలో ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ గా తనకు జర్నలిస్టుల తో విడదీయరాని అనుబంధం ఉందని, తెలంగాణ ఉద్యమ సమయం లో సైతం జర్నలిస్టులతో కలిసి పోరాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, అందుకే జర్నలిస్టుల కష్ట సుఖాలు తనకు తెలుసని ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులను సన్మానించడం అభినందనీయమని, ఇది సమాజంలో మంచి సాంప్రదాయమని అన్నారు. సమాజానికి విశిష్ట సేవలందించిన సీనియర్ పాత్రికేయులను మర్చిపోకుండా గౌరవించుకోవాలని, ఈ సాంప్రదాయం ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ, దేశంలో జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక మొదటి యూనియన్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అని అన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం సాధన కై దేశవ్యాప్తంగా పోరాడుతుందని, అదేవిధంగా రిటైర్డ్ పాత్రికేయుల కోసం జాతీయ పెన్షన్ పథకం,జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు కోసం ఉద్యమిస్తుందని అన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘానికి అనుబంధంగా ఉన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలోపేతమై త్వరలో జర్నలిస్టుల సమస్యలపై కార్యాచరణ ప్రకటిస్తుందని మామిడి సోమయ్య వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు టి. ఉడయవర్లు, నందిరాజు రాధాకృష్ణ, అద్దంకి శ్రీరామ కుమార్, సిబి లక్ష్మి, యర్రమిల్లి రామారావు తదితరులను ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవి కుమార్, కో- కన్వీనర్లు శ్రీనివాస్ గౌడ్, ఎం. రవికుమార్, రాష్ట్ర నాయకులు పి.ఆనందం, కె.పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు
ఏ రవీందర్ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి
ట్యాగ్లు:
Latest News