మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత
సూర్య - మానకొండూర్ : రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఆధ్వర్యంలో బుధవారం వివిధ రకాల పరికరాలను అందజేశారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మానకొండూర్ సహకార సంఘం సీఈఓ ఎడ్ల స్వామికి ఈ యంత్రాలను అందజేశారు సొసైటీకి మొత్తం 4 ధాన్యం తూకం యంత్రాలు, 80 టార్పాలిన్లు, 2 మాయిశ్చర్ (తేమ కొలిచే) యంత్రాలు, 3 విత్తన పరిమాణం కొలిచే యంత్రాలను పంపిణీ చేసినట్లు పాలకవర్గ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం మాట్లాడుతూ... ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నందున వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చిన రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తగా 80 టార్పాలిన్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సొసైటీ సీఈఓను ఆదేశించారు. రైతులు సైతం నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు ముక్కెర సతీష్, రాపాక రాజేశ్వర్,లతో పాటు పలువురు కమిటీ సభ్యులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.