ఎల్‌నినో ప్రభావంతో ఉపాధి కోల్పోకుండా గ్రామీణ కూలీలకు పనులు కల్పించాలి
వి.బి.జి. రాంజీ పథకం కింద గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి: మంత్రి సీతక్క
(రంగారెడ్డి - మేజర్ న్యూస్) ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే కొత్త పనులను గుర్తించి, వి.బి.జి. రాంజీ పథకం కింద పనులు కల్పించాలని ఆదేశించారు.
బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో డి. దివ్య దేవరాజన్, ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్‌తో కలిసి అదనపు కలెక్టర్లు, పీడీ డీఆర్‌డీఏలు, సర్పంచులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించడంతోపాటు వి.బి.జి. రాంజీ పథకం అమలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కూలీలకు పని దొరకడంతోపాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, మ్యారేజ్ హాళ్లు, పాఠశాల భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు, గోదాములు, కమ్యూనిటీ హాళ్లు వంటి అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వి.బి.జి. రాంజీ పథకం కింద ఉన్న వివిధ రకాల పనులపై సర్పంచులకు అవగాహన కల్పించి, పనిదినాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పథకం కింద చేపట్టిన పనులకు పది రోజుల్లోనే కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, నిధుల విషయంలో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మంజూరైన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామసభలు నిర్వహించి అవసరమైన పనులను గుర్తించడం, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సూచించారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వి.బి.జి. రాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఆదర్శ గ్రామంగా ఎంపికైన గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కోటి రూపాయల నిధులు అందుతాయని తెలిపారు. పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సూచించారు.
అలాగే రైతులు లేదా గ్రామ సంఘాల ఆధ్వర్యంలో పశుగ్రాసం సాగు చేస్తే ఎకరానికి రూ.14 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ సహాయంతోపాటు పండించిన పశుగ్రాసాన్ని విక్రయించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.
పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు
సమీక్షలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) డాక్టర్ కె. కిరణ్మయి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించిన వీవో భవనాలు, అదనపు గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వి.బి.జి. రాంజీ పథకం కింద పనిదినాలు పెంచేందుకు ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీతోపాటు హాబిటేషన్లలోనూ ఉపాధి పనులు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పశుగ్రాసం సాగును ప్రోత్సహించడంతోపాటు నీటి సంరక్షణ కోసం వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీడీ డీఆర్‌డీఏ శ్రీలత, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, మిషన్ భగీరథ ఎస్‌ఈ రాజేశ్వర్ రావు, డీపీఓ సురేశ్ మోహన్, వ్యవసాయ శాఖ అధికారి సుజాత, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.