రైస్ మిల్లర్లు బకాయిలను వెంటనే చెల్లించాలి-కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను రైస్ మిల్లర్లు వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవ సహాయంతో కలిసి కలెక్టర్ రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ బకాయిల చెల్లింపు పరిస్థితి, రానున్న సీజన్‌లో సన్న బియ్యం కొనుగోళ్లపై చర్చించారు.
జీవో నంబర్ 17 ప్రకారం పెండింగ్ బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు మిల్లర్లకు 45 రోజుల గడువు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వ్యవధిలో నగదు రూపంలో బకాయిలు చెల్లించాలి లేదా సమాన విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.
గడువులోగా బకాయిలు చెల్లించని మిల్లర్లపై ఆస్తుల జప్తు, క్రిమినల్ కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిఫాల్ట్ మిల్లర్లకు తదుపరి సీజన్‌లో బియ్యం కేటాయింపులు ఉండవని అధికారులు తెలిపారు. బకాయిల వసూళ్లను వేగవంతం చేసి, చెల్లింపుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఇన్‌చార్జి సివిల్ సప్లై అధికారి హైదర్ అలీ, డీఎం రాజేందర్, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
సందడి రవీందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ,రూరల్, సూర్య న్యూస్: