వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష - మంథని ఆసుపత్రి, గురుకుల పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీలు
సూర్య – పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం మంథని ప్రభుత్వ ఆసుపత్రి, టీ.జీ.డబ్ల్యూ.ఆర్.జె.సి పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ విభాగం, వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుధ్యాన్ని పరిశీలించారు. రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
అనంతరం గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యాబోధన, భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని, చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ సంస్థల్లో సేవల నాణ్యత పెంచేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యటనలో సంబంధిత అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.