మినరల్ వాటర్తోనూ ఆరోగ్య ముప్పు.. బ్రోమేట్, పీఏహెచ్ఎస్ రసాయనాలపై ఆందోళన
ప్రయాణాలలోనూ, బయటకు వెళ్లినప్పుడూ మనం ఎంతో నమ్మకంగా తాగే ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ భద్రతపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. సాధారణ నీటి కంటే బాటిల్ వాటర్ అత్యంత శుభ్రమైనదని, సురక్షితమైనదని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇటీవల ఒక ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ నమూనాల్లో నిర్దేశిత ప్రమాణాలకు మించి హానికర రసాయనాలు ఉన్నట్లు ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ గుర్తించి విచారణకు ఆదేశించడం కలకలం రేపుతోంది. పరీక్షించిన నీటి నమూనాల్లో బ్రోమేట్ మరియు పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ స్థాయిలు పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో, ఈ రసాయనాలు నీటిలోకి ఎలా చేరుతాయి, ఆరోగ్యంపై వాటి ప్రభావం ఏమిటనే అంశాలపై నిపుణుల విశ్లేషణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నీటిలోని సూక్ష్మక్రిములను నిర్వీర్యం చేయడానికి శుద్ధి ప్రక్రియలో ఓజోన్ వాయువును ఉపయోగిస్తున్నప్పుడు బ్రోమేట్ అనే రసాయన ఉప-ఉత్పత్తి ఏర్పడుతుంది. నీటిలో సహజంగా ఉండే బ్రోమైడ్తో ఓజోన్ చర్య జరిపినప్పుడు ఇది తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం తాగునీటిలో బ్రోమేట్ పరిమితి లీటరుకు 10 మైక్రోగ్రాముల మించకూడదు, కానీ ఇటీవల సేకరించిన శాంపిల్లో లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అధిక మోతాదులో బ్రోమేట్ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలాగే క్యాన్సర్ కలిగించే అవకాశం ఉన్న పదార్థాల జాబితాలో దీనిని చేర్చగా, మోతాదు మించితే వికారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో పాటు నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు బొగ్గు, చమురు, కలప వంటివి పూర్తిగా మండకపోవడం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ పారిశ్రామిక వ్యర్థాలు, పెట్రోలియం లీకేజీలు, వాహన కాలుష్యం, వర్షపు నీటి ద్వారా భూగర్భ జలాలు మరియు నదుల్లోకి చేరుతాయి. శుద్ధి ప్లాంట్ల పరిసరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్నా, ఫిల్ట్రేషన్ విధానంలో లోపాలు తలెత్తినా ఇవి నీటిలోకి ప్రవేశించే ఆస్కారం ఉంటుంది. వీటిలోని బెంజోపైరీన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ ముప్పును పెంచడమే కాకుండా, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీలు మరియు చర్మ సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రతి బాటిల్ వాటర్ కలుషితమైందని ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హితవు పలుకుతున్నారు. బాటిల్ కొనుగోలు చేసేటప్పుడు సీల్ సరిగ్గా ఉందో లేదో, లైసెన్స్ వివరాలు మరియు బ్యాచ్ నంబర్ స్పష్టంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఎండలో ఎక్కువసేపు ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగకపోవడం మంచిదని, ఇంట్లో నీటిని బాగా మరిగించి చల్లార్చి తాగడం లేదా నాణ్యమైన వాటర్ ప్యూరిఫయర్లను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తూ వాడటం సురక్షితమైన మార్గమని సూచిస్తున్నారు.