ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
- జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్
-కాకినాడ నగరపాలక సంస్థ మరియు మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ..
కాకినాడ పట్టణం/కరప, నవంబర్ 25:
ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది ఎలాంటి గందరగోళానికి తావులేకుండా,పోలింగ్ సిబ్బందికి సకాలంలో ఎన్నికల సామగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) ప్రక్రియను పూర్తి చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు.
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు మరియు మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం ఆయన నగరంలోని మెక్లారేన్ హైస్కూల్ మైదానం తో పాటు కరప మండలం కరప జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తొలుత కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి స్థానిక మెక్లారేన్ హైస్కూల్ మైదానంలో జరుగుతున్న పోలింగ్ సామగ్రి పంపిణీ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్.. కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణతో కలిసి సమీక్షించారు. ఆయా వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళ్లి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంక్ బాటిళ్లు మరియు ఇతర ముఖ్యమైన ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందిస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి కేటాయించిన రూట్ మ్యాప్‌లు, రవాణా సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి త్రాగునీరు, భోజన వసతి వంటి కనీస సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని సూచించారు.
అనంతరం మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కరప మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సందర్శించారు. అక్కడ పంచాయతీల వారీగా జరుగుతున్న సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులకు (ఏఆర్వోలు) పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించే వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, సాయంత్రం లోగా సిబ్బంది అందరూ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
కరప మండలంలో 23 గ్రామ పంచాయతీలకు పాతర్లగడ్డ మొత్తం గ్రామ సర్పంచ్ తో పాటు వార్డ్ నెంబర్లు ఏకగ్రీవంకాగా, నరకుదురు గ్రామం సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జేసీ అపూర్వ భరత్ తెలిపారు. గురువారం 21 గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ జరగ నున్నదని జేసీ తెలిపారు.
ఈ తనిఖీల్లో రిటర్నింగ్ అధికారి జి. శ్రీనివాసరావు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.