ఆర్థిక అక్షరాస్యతపై ఆర్బీఐ అవగాహన సదస్సు
గొల్లప్రోలు, మేజర్ న్యూస్ : విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడంతో పాటు, బ్యాంకింగ్ సేవలు, పొదుపు, పెట్టుబడులు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలో అప్ లిఫ్ట్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ మేనేజర్ రామకృష్ణ, కాకినాడ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) చి.ఎస్.వి. ప్రసాద్ విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, పొదుపు అలవాట్ల ప్రాముఖ్యత, సరైన పెట్టుబడి మార్గాలు, డిజిటల్ లావాదేవీల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించకూడదని, మోసపూరిత ఫోన్ కాల్స్, లింకుల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. వై.వి.ఎన్. రాజశేఖర్, డీన్ (ఆర్ అండ్ డీ) డా. ఎస్.వి.ఆర్.కె. రావు, టీపీఓ టి. ప్రేమ్ బోస్కో, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం. సుబ్బారావు, ఇంగ్లీష్ ప్రొఫెసర్ డా. కె. రామారావు పాల్గొన్నారు. అలాగే సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (ఎస్‌ఎస్‌టీ) డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సుమంత్, పిఠాపురం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు షేక్ దాదా, బి. రత్నరాజు, ఎం.డి. ఇర్ఫాన్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపయోగకరమైన ఆర్థిక అవగాహన కార్యక్రమాన్ని తమ కళాశాలలో నిర్వహించినందుకు ఆర్బీఐ అధికారులకు ప్రిన్సిపాల్ డా. వై.వి.ఎన్. రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.