బాలల భద్రతకు పోక్సో చట్టం పటిష్ట అమలు
- విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు
గొల్లప్రోలు, మేజర్ న్యూస్ : బాలలపై లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తోందని పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు ప్యానల్ న్యాయవాదులు తెలిపారు. పిల్లల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి ఎస్‌డీఆర్‌ఎస్‌ఏ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంఘం చైర్మన్ పి. భాస్కరరావు ఆదేశాల మేరకు ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు సరిదే నాగేశ్వరరావు, కొంగు నూకరాజు, ఎం. సత్యవతి, వెంకటలక్ష్మి పాల్గొని విద్యార్థులకు బాలల హక్కులు, భద్రత, చట్టపరమైన రక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికలందరికీ పోక్సో చట్టం రక్షణ కల్పిస్తుందని వివరించారు. ఈ చట్టం బాలికలకే పరిమితం కాకుండా లైంగిక వేధింపులకు గురయ్యే బాలురకు కూడా సమాన రక్షణ అందిస్తుందని తెలిపారు. నేర తీవ్రతను బట్టి నిందితులకు 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు, చట్టంలో నిర్దేశించిన కొన్ని తీవ్రమైన నేరాల్లో మరణశిక్ష విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాలలపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలను దాచిపెట్టకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం కూడా చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుందని వివరించారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. నాగమణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.