తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్'.. నవంబర్ 27న విడుదల
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హృదయాన్ని హత్తుకునే తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో రూపొందిన చిత్రం 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత దీపక్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ ప్రధాన పాత్రల్లో నటించగా, బేబీ పరిణిత రుద్రరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ వేడుకలో మాట్లాడిన జెమిని సురేష్ తన పాత్ర గురించి వివరిస్తూ, ఇందులో తండ్రి పాత్ర తన వ్యక్తిగత జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుందని చెప్పారు. ప్రతి తండ్రి తన పిల్లల నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటారని, ఈ చిత్రంలోని తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రేక్షకుల మనసులను తప్పకుండా తాకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శకుడు శరత్ మాట్లాడుతూ, హీరో రజత్ తనకు ఏడేళ్లుగా మంచి స్నేహితుడని, తాను రాసే ప్రతి కథను ముందుగా అతనికే వినిపిస్తానని తెలిపారు. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని, నిర్మాత దీపక్ ఔట్‌పుట్ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నారని, ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయని అన్నారు.
నిర్మాత దీపక్ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రయాణం కేబీఆర్ పార్క్ వద్ద హీరో రజత్‌ను కలిసినప్పటి నుంచి మొదలైందని గుర్తుచేసుకున్నారు. కథ విన్న వెంటనే ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నానని, తాను ఊహించిన దానికంటే మరింత అందంగా దర్శకుడు శరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పారు. వినోదం, భావోద్వేగాలతో పాటు నిజమైన ప్రేమ తాలూకు అర్థాన్ని ఈ సినిమా చూపిస్తుందని, హీరో రజత్ పడ్డ కష్టం మంచి ఫలితాన్ని ఇస్తుందని అన్నారు. తొలి చిత్రంతోనే నిర్మాతగా మంచి గుర్తింపు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ, చిత్రబృందం అందరి సమష్టి కృషితో ఈ సినిమాను పూర్తి చేశామని తెలిపారు. ట్రైలర్ చూసినప్పుడల్లా తాను ఎంతో భావోద్వేగానికి గురవుతానని, జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారని, అయితే ఆ తప్పును దిద్దుకుని ముందుకు సాగే వ్యక్తే నిజమైన పరిపూర్ణత సాధిస్తాడనే సందేశాన్ని దర్శకుడు ఈ సినిమాలో చూపించారని అన్నారు. బలమైన సంభాషణలు, నటన, హృదయాన్ని తాకే భావోద్వేగాల కలయికతో రూపొందిన 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్' తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read: సినీ రంగంలో మహిళల సత్తా.. అవకాశాలు పెరుగుతున్నాయన్న స్వప్న దత్