సినీ రంగంలో మహిళల సత్తా.. అవకాశాలు పెరుగుతున్నాయన్న స్వప్న దత్
రిమితమయ్యేవారని, కానీ ఇప్పుడు ఎడిటింగ్, కెమెరా, దర్శకత్వం, టెక్నికల్ విభాగాలతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ప్రతిభతో దూసుకుపోతున్నారని తెలిపారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత, పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆర్థిక రంగంలో మహిళల పాత్ర, పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన మార్గాలపై జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో తన సొంతూరు విజయవాడకు చాలా రోజుల తర్వాత రావడం ఆనందంగా ఉందని స్వప్న దత్ చెప్పారు. తన బ్యానర్ నుంచి తెరకెక్కిన ఆకాశం లోకతార చిత్రం విడుదలైన తొలి వారంలోనే నగరంలోని మహిళలను కలవడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందన్నారు. తమ నిర్మాణ సంస్థలో రూపొందుతున్న చిత్రాలు వరుస విజయాలు సాధిస్తుండటం సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లోనూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు.
గతంలో సినీ రంగంలో మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్ వంటి విభాగాలకే ఎక్కువగా పరిమితమయ్యేవారని, అయితే నేడు అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ఇతర కీలక విభాగాల్లోనూ మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని స్వప్న దత్ వివరించారు. తమ నిర్మాణ సంస్థలో దాదాపు 30 నుంచి 35 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని వెల్లడించిన ఆమె, వివిధ స్టూడియోలలోనూ మహిళల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామమని అన్నారు.
సినిమా రంగం ఎప్పుడూ కొత్త ప్రతిభను స్వాగతిస్తుందని, మహిళలు తమలోని సృజనాత్మకతకు మరింత పదును పెట్టి పరిశ్రమలోకి రావాలని స్వప్న దత్ సూచించారు. ఆర్థికంగా స్వతంత్రంగా నిలదొక్కుకుంటూ పారిశ్రామికవేత్తలుగా ప్రత్యేక గుర్తింపు సాధించాలని పిలుపునిచ్చిన ఆమె, సరైన అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: సంబరాల ఏటిగట్టు సంక్రాంతి విడుదలపై సందేహాలు.. ప్రమోషన్ల వేగం ఎక్కడ?