నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలో స్పష్టత ఉంది: నిత్యా మేనన్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఎప్పుడూ చెప్పలేదని, జీవితంలో సరైన వ్యక్తితో బంధం ఏర్పడాలని తాను కూడా కోరుకుంటున్నానని ప్రముఖ నటి నిత్యా మేనన్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ వ్యక్తిగత జీవితం, బంధాలు, స్వేచ్ఛపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. తాను పెళ్లి గురించి మాట్లాడినప్పుడల్లా పెళ్లికి వ్యతిరేకమని లేదా అసలు చేసుకోవాలనే ఆలోచన లేదని చాలామంది అపోహ పడుతుంటారని, కానీ తన ఉద్దేశం అది కాదని తేల్చి చెప్పారు. పెళ్లి చేసుకోవాలనే కోరిక తనకు కూడా ఉన్నప్పటికీ, ఎలాంటి వ్యక్తి కావాలి మరియు బంధం ఎలా ఉండాలి అనే విషయంలో తనకు పూర్తి స్పష్టత ఉందని ఆమె వివరించారు.
గతంలో తాను ఎదుర్కొన్న కొన్ని రిలేషన్‌షిప్ అనుభవాలను నిత్యా మేనన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మన స్వేచ్ఛను హరించి, ఆలోచనలు లేదా నిర్ణయాలను అదుపు చేసే బంధాల్లో ఉన్నప్పుడు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుందని, ఎదగడానికి అవకాశం లేకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ బంధం నుంచి బయటకు రావడం మొదట్లో కష్టంగా అనిపించినప్పటికీ, బయటకు వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా మారి కొత్త ప్రపంచం తెరుచుకున్న అనుభూతి కలుగుతుందని తెలిపారు. అది భయంతో తీసుకున్న నిర్ణయం కాదని, జీవిత అనుభవాల నుంచి నేర్చుకున్న వాస్తవమని స్పష్టం చేశారు.
కేవలం పెళ్లి చేసుకోవడమే తన లక్ష్యం కాదని, ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటూ వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చే సరైన బంధాన్ని ఏర్పరచుకోవడమే ముఖ్యమని నిత్యా మేనన్ పేర్కొన్నారు. స్వేచ్ఛనిచ్చే భాగస్వామి దొరికినప్పుడే పెళ్లికి సిద్ధపడతానని, అలాంటి పరిస్థితి లేనప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నిక్కచ్చిగా చెప్పారు. ప్రస్తుతం తన జీవితం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉందని, ఆ ప్రశాంతతను చెరిపేసే బంధాల్లోకి అడుగుపెట్టాల్సిన పనిలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
సినిమాల విషయానికొస్తే, నిత్యా మేనన్ ప్రస్తుతం వివేక్ ఒబెరాయ్‌తో కలిసి నటించిన హిందీ చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ గ్రే విడుదలకు సిద్ధంగా ఉంది. అంకుర్ పజ్ని, విశాల్ రంజన్ మిశ్రా సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యక్తిగత జీవితంలో స్పష్టతతో ముందుకు సాగుతున్న నిత్యా మేనన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి.
Also Read: 23 ఏళ్ల తర్వాత దర్శకుడు కిరణ్ కర్నీడి రీఎంట్రీ.. ఏఐతో పాన్ ఇండియా చిత్రం స్ట్రైకర్