సంబరాల ఏటిగట్టు సంక్రాంతి విడుదలపై సందేహాలు.. ప్రమోషన్ల వేగం ఎక్కడ?
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: 2027 సంక్రాంతి పండుగ బరిలో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా విడుదలపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ సందేహాలు నెలకొన్నాయి. సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌లో పండుగ వాతావరణంతో పాటు భారీ పోటీ, ప్రమోషన్ల సందడి ప్రత్యేకంగా ఉంటాయి. అయితే సంక్రాంతి బరిలో నిలవడానికి ఇంకా దాదాపు నలభై రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఈ చిత్రం నుంచి ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన కదలికలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈసారి సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు పోటీలో నిలిచాయి. చిరంజీవి కాకా, శర్వానంద్ జార్జ్ క్రిష్, శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్, అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల, ప్రశాంత్ వర్మ మహాకాళి వంటి చిత్రాలు ఇప్పటికే ప్రమోషన్లను ప్రారంభించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. కానీ సంబరాల ఏటిగట్టు చిత్రబృందం మాత్రం ఇంతవరకు కొత్త ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంపై తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి చిత్రం పోటీలో ఉన్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిర్మాత నిరంజన్ రెడ్డి గతంలో ధీమా వ్యక్తం చేసినప్పటికీ, ప్రస్తుతం ప్రమోషన్లలో కనిపిస్తున్న నిశ్శబ్దం పలు అనుమానాలకు తావిస్తోంది. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని వార్తలు వచ్చినా, కనీసం ఒక్క కొత్త విజువల్ అప్‌డేట్ కూడా రాకపోవడంతో సినిమా మరోసారి వాయిదా పడుతుందేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న సంబరాల ఏటిగట్టులో ఐశ్వర్య లక్ష్మి, అనన్య నాగళ్ళ, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి గతంలో విడుదలైన పోస్టర్లు, ప్రత్యేక వీడియోలు మంచి హైప్ సృష్టించాయి. మరి మిగిలిన తక్కువ సమయంలో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేసి సంక్రాంతి బరిలో నిలుస్తారా లేదా అన్నది చూడాలి.
Also Read: అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐ.వి. రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఈఓ లక్ష్మీ శివజ్యోతి