తాండూరులో కారు బీభత్సం.. 12 బైకులు ధ్వంసం
తాండూరు, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్‌లో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు రోడ్డుపై పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏకంగా 12 బైకులు ధ్వంసం కాగా, ఓ ఆటో కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.కారు అతివేగంగా రావడంతోనే అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా, TS09EU9483 నంబర్ గల కారుపై గతంలోనే అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్‌కు సంబంధించి ఐదు ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు ఈ-చలాన్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. మొత్తం రూ.5,175 జరిమానా విధించారు.గతంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు చలాన్లు నమోదైనప్పటికీ, తాజాగా తాండూరులో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాద సమయంలో బైకుల వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు అదుపుతప్పడానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.