కట్టంగూర్ పంచాయితీ.. నిధులున్నా కొరవడిన గతులు!* అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆధిపత్య పోరు!*నాడు ఉపసర్పంచ్‌కు అవమానం.. నేడు సర్పంచ్‌కు పరాభవం
నల్గొండ జిల్లా కట్టంగూర్
ప్రజాస్వామ్యంలో గ్రామమే దేశానికి పట్టుకొమ్మ. అలాంటి గ్రామాల్లో పాలన సాగించాల్సిన పాలకవర్గమే పట్టాల తప్పితే, ఆ ఊరి ప్రజల బతుకులు ఎలా చిమ్మచీకట్లోకి నెట్టబడతాయో చెప్పడానికి కట్టంగూర్ గ్రామ పంచాయతీ తాజా పరిస్థితి ఒక నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు పంచాయతీ ఖాతాలో లక్షల రూపాయలు భారీ నిధులు మూలుగుతున్నా.. మరోవైపు వీధిదీపాలు వెలగక గ్రామం అంధకారంలో మగ్గుతుండటం స్థానికంగా తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. పదవుల కోసం సాగుతున్న ఆధిపత్య రాజకీయాలు నేడు కట్టంగూర్ అభివృద్ధిని అడుగువెనుకకు లాగుతున్నాయి.
*రాజకీయం రంజుగా.. అభివృద్ధి బంద్‌గా!*
గ్రామప్రథమ పౌరులుగా గెలిచి ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు.. 'ఎవరు గొప్ప' అనే వ్యక్తిగత అహంకారాలు, ఆధిపత్య పోరులో పడి ఊరి సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారు.
నాడు ఉపసర్పంచ్‌కు అవమానం.. నేడు సర్పంచ్‌కు పరాభవం! పండుగ పూట మొదలైన ఈ విబేధాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుతున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే కుట్ర రాజకీయాలతో గ్రామ పరువును బజారున పడేస్తున్నారు.
గట్టున నిధులు.. గొంతులో వెలగని దీపాలు: పంచాయతీ అకౌంట్‌లో సుమారు రూ.50 లక్షల నిధులు సిద్ధంగా ఉన్నా, వాటిని ఖర్చు చేసే దిక్కులేదు. ప్రజల మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు వంటి కనీస సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిధులున్నా అభివృద్ధి ఎందుకు జరగడం లేదో అధికారులే సమాధానం చెప్పాలి!
*తెరవెనుక రాజకీయ రంగులు.. రెండుగా చీలిన పాలకవర్గం*
ఈ పంచాయతీ పోరు కేవలం స్థానిక సమస్య మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద రాజకీయ క్రీడే నడుస్తోంది.
ఈ రాజకీయ అండదండల జోక్యంతో పాలకవర్గం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ వర్గపోరు ఎంత దూరం వెళ్లిందంటే.. చివరికి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడం, కొన్ని రోజుల పాటు పంచాయతీ కార్యదర్శి కూడా లేని దుస్థితి నెలకొనడం ఇక్కడి అరాచక పాలనకు అద్దం పడుతోంది.
*ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది!*
"నాడు ఉపసర్పంచ్.. నేడు సర్పంచ్.. రేపు గ్రామ ప్రజల పరిస్థితి ఏమిటి?" అనే ప్రశ్న నేడు ప్రతి కట్టంగూర్ వాసి గుండెను తొలుస్తోంది. ప్రజలు ఎన్నుకున్నది సమస్యలు పరిష్కరించడానికా? లేక కుర్చీలాటలాట ఆడుకోవడానికా?
అధికారులకు హెచ్చరిక: ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని, ఈ ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకాలి. లక్షల రూపాయలు నిధుల వినియోగంపై పూర్తి స్థాయి స్పష్టతనిచ్చి, నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పట్టాలెక్కించాలి. లేనిపక్షంలో కట్టంగూర్ ప్రజాగ్రహానికి పాలకవర్గంతో పాటు బాధ్యతలేని అధికారులు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు.
పదవులు శాశ్వతం కాదు.. ప్రజల ఆశీర్వాదమే గొప్పది. ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరిచి, వ్యక్తిగత విబేధాలు వీడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.