సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మెగా జాబ్ మేళా
సదాశివపేట;ప్రభుత్వ డిగ్రీ కళాశాల సదాశివపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. మొత్తం 22 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 420 మంది యువతీ యువకులు ఉద్యోగాల కోసం హాజరయ్యారు. వివిధ దశల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 191 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కళాశాల యాజమాన్యం జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి కళాశాల అభివృద్ధికి అవసరమైన బాలికల హాస్టల్, కంప్యూటర్ ల్యాబ్, ప్రహరీ గోడ నిర్మాణం వంటి అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ రఘునందన్ రావు బాలికల హాస్టల్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకారం అందించేలా సంబంధిత సంస్థలతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కంప్యూటర్ ల్యాబ్ కోసం తనవంతుగా 10 కంప్యూటర్లు అందిస్తానని, ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి సహకారం అందిస్తానని ప్రకటించారు.కళాశాల అభివృద్ధికి ఎంపీ సానుకూలంగా స్పందించి హామీలు ఇవ్వడంపై ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సిద్ధులు, అధ్యాపకులు సర్వయ్య, స్రవంతి, శకుంతల, మంజుల తదితర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు.ఒకవైపు 191 మంది యువతకు ఉద్యోగాలు.. మరోవైపు కళాశాల అభివృద్ధికి ఎంపీ హామీలు.. సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది.