telangana
ప్రభుత్వ బడుల అభివృద్ధి మనందరి బాధ్యత : మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు
ఘట్‌కేసర్ మేజర్, న్యూస్ : ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఘట్‌కేసర్ మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులు బలోపేతమైతేనే పేద, సామాన్య కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన బడులు.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఆయన సహకారంతో తరగతి గదులు, ప్రహరీ గోడ, పాఠశాల ఆవరణకు రంగులు వేయించారు. ఈ పనులను నందం గణేష్ బాబు, స్థానిక మాజీ ఎంపీటీసీ చిలుగూరి గోపాల్ రెడ్డి, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గణేష్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకున్నప్పుడే చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మనందరి బడులని, వాటి అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. పాఠశాలల అభ్యున్నతికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, దాతలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరిస్తే ప్రభుత్వ బడులను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేపడుతున్న ‘మన బడులు.. మన బాధ్యత’ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసు, ఉపాధ్యాయులు లక్ష్మీ కల్పన, ఎం.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.