పేదల ఆత్మగౌరవానికి పెన్షన్లు కొండంత అండ
పేదల ఆత్మగౌరవానికి పెన్షన్లు కొండంత అండ
-అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
-ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్)- నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల ఆత్మగౌరవానికి చేయూత పెన్షన్లు కొండంత అండగా నిలుస్తాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో నూతనంగా మంజూరైన 1,185 చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ఈ పెన్షన్లు వెలుగులు నింపుతాయన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని స్పష్టం చేశారు.కొత్తగూడెం కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. మురుగునీటి వ్యవస్థ, అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి కార్పొరేషన్‌కు కొత్త రూపునిస్తామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, మేయర్ మూడు గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, ప్రజా ప్రతినిధులు పసుపులేటి వీరబాబు, లాల్ సింగ్, మండే హనుమంతరావు, నాయకులు నాగ సీతారాములు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, ఎస్.కే. ఫహీం, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.