కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్
కౌడిపల్లి : మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో శుక్రవారం టీబీ (క్షయ) స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ శిబిరంలో కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాలకు చెందిన మొత్తం 274 మందికి టీబీ నిర్ధారణలో భాగంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించినట్లు కౌడిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పి. శ్రీకాంత్ తెలిపారు.ఈ స్క్రీనింగ్ క్యాంపును డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించడంతో పాటు వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ తక్షణమే అవసరమైన మందులు అందించి, పూర్తిస్థాయిలో చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీబీ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీబీ స్క్రీనింగ్ టెక్నీషియన్లు మహేష్ (ఎస్‌టీఎస్), రాజు (ఎస్‌టీఎల్‌ఎస్), పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ ఫర్నాజ్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.