స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
ఏకగ్రీవ ఎన్నికలపై అవగాహన కల్పించండి.. కానీ ఎవరినీ బలవంతం చేయొద్దు
ఒత్తిడి లేని ఏకగ్రీవాలే ఆదర్శం.. రూ. 50 లక్షల వరకు ప్రోత్సాహకాలు
ఐకమత్యంతో ఏకగ్రీవం చేసుకోండి.. గ్రామాభివృద్ధికి భారీ నిధులు పొందండి
వర్గ విభేదాలకు చెక్.. స్వచ్ఛంద ఏకగ్రీవాల దిశగా అడుగులు వేయండి
జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి
పార్వతీపురం, నవంబర్ 13 మేజర్ న్యూస్: రానున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో గ్రామాలు ఎలాంటి వర్గ విభేదాలకు తావులేకుండా, ఐకమత్యంతో ముందుకు సాగేలా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఏకగ్రీవ ఎన్నికల ప్రోత్సాహక పథకంపై ఆయన స్పందిస్తూ, గ్రామాల్లో ప్రజలకు ఏకగ్రీవ ఎన్నికల ప్రాముఖ్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, పెద్దలు పరస్పర అంగీకారంతో స్వచ్ఛందంగా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఎన్నుకోవాలని కలెక్టర్ సూచించారు. అయితే ఈ ప్రక్రియలో ఎవరిపైనా ఎటువంటి బలవంతం, ఒత్తిడి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే హక్కుకు, అలాగే అర్హులైన అభ్యర్థులు పోటీ చేసే చట్టబద్ధమైన హక్కులకు ఎటువంటి భంగం కలగకూడదని ఆయన నొక్కిచెప్పారు.
ప్రభుత్వం ప్రకటించిన భారీ నజరానాలను గ్రామాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన 5,000 లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ. 15 లక్షలు, 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉంటే రూ. 25 లక్షలు, అలాగే 10,000 పైబడి జనాభా ఉన్న గ్రామాలకు ఏకంగా రూ. 50 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక నిధులను అందజేస్తుందని తెలిపారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు దశలవారీగా అందే ఈ నిధులను కేవలం గ్రామాభివృద్ధి పనులకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే పూర్తిగా వెచ్చించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో స్వచ్ఛంద ఏకగ్రీవాలతో తమ గ్రామాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.