వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంకు అనుబంధమైన పశువైద్య విజ్ఞాన కళాశాల, వెటర్నరీ ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ఆడిటోరియంలో ఒకరోజు ప్రాంతీయ సదస్సుతో పాటు సౌత్ జోన్ వెటర్నరీ ఫిజియాలజీ క్విజ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. పశువైద్య విజ్ఞాన కళాశాల ప్లాటినం జూబ్లీ సంవత్సర వేడుకల్లో భాగంగా, సొసైటీ ఆఫ్ యానిమల్ ఫిజియాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి డా.వి.వైకుంఠరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విశిష్ట అతిథులుగాపశువైద్య విజ్ఞాన విభాగం డీన్ డా.ఆర్.వి.సురేష్ కుమార్, రిజిస్ట్రార్ డా.ఆర్.వినూ గౌరవ అతిథులుగా పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మాజీ డీన్, బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.వీరసామి సెజియన్ ఎస్.వి.మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ విభాగాధిపతి డా.వి.ఎస్.భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాభ్యాసం ప్రారంభ దశ నుంచే శాస్త్రీయ పరిజ్ఞానంపై పటిష్టమైన పునాదిని ఏర్పరచుకోవాలని సూచించారు. నిరంతరం తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకుంటూ విద్యా వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. డా.వీరసామి సెజియన్ మాట్లాడుతూ పశువైద్య పట్టభద్రులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. డా.వి.ఎస్.భాగ్యలక్ష్మి వెటర్నరీ ఫిజియాలజీ ప్రాముఖ్యత విస్తృత పరిధిని వివరించారు. డా.ఆర్.వి.సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, విజయానికి క్రమశిక్షణ మరియు చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
15 బృందాలతో క్విజ్ పోటీలు…
సౌత్ జోన్ వెటర్నరీ ఫిజియాలజీ క్విజ్ పోటీలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ పశువైద్య కళాశాలల నుంచి 15 బృందాలుగా మొత్తం 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రెండు దశల్లో ఉత్కంఠభరితంగా సాగిన క్విజ్ పోటీల అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తమిళనాడులోని తిరునెల్వేలి వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వి.వైశాలి, ఎం.షాజికా సౌత్ జోన్ వెటర్నరీ ఫిజియాలజీ క్విజ్ పోటీ–2026 విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జోనల్ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహించి, ఆయా జోన్ల నుంచి ఎంపికైన విజేత బృందాలు జాతీయ స్థాయి క్విజ్ పోటీలో తమ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాయి. పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ డీన్ డా.పి.మాలకొండయ్య, పశువైద్య ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా.బి.రాంబాబు నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఎల్.ఎస్.ఎస్. వరప్రసాద్ రెడ్డి, గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య విజ్ఞాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఇక్బాల్ హైదర్ పాల్గొన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులను నిర్వాహకులు అభినందించి, జాతీయ స్థాయి పోటీలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం రోడ్డు తిరుపతి స్టాప్ రిపోర్టర్