ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం..
అమలాపురం మేజర్ న్యూస్ :ప్రజలకు మరింత నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలను అందించడంతోపాటు ప్రభుత్వ వైద్య వ్యవస్థలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ సంజీవని’ అమలుపై జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖల అధికారులు, టాటా ఎండీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరు, సాంకేతిక ఏర్పాట్లు, ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందికి అందించనున్న శిక్షణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.అన్ని ఆసుపత్రులకు ఒకే డిజిటల్ వేదిక ప్రాజెక్ట్ సంజీవనిలో భాగంగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , సామాజిక ఆరోగ్య కేంద్రాలు , ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను ఒకే డిజిటల్ వేదిక అయిన హెల్త్‌ఎక్స్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయనున్నారని కలెక్టర్ తెలియజేసారు. సహకారాలు అందిస్తారని, రిజిస్ట్రేషన్ నుంచి వైద్య సేవలు పొందే వరకు రోగులకు మార్గనిర్దేశం చేస్తారని కలెక్టర్ తెలిపారు.
మారుమూల ప్రాంతాలకూ స్పెషలిస్ట్ వైద్య అందిస్తూ చికిత్సలో నిరంతరత ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా తగిన వైద్య సేవలు అందించేందుకు ఈ విధానం ఉపయోగపడనుందని తెలియజేసారు. 200 మందికి పైగా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రాజెక్ట్ సంజీవని విజయవంతంగా అమలు కావాలంటే వైద్య సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన అవసరమని సమావేశంలో అధికారులు వివరించారని, ఈ నేపథ్యంలో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సంజీవని మిత్రలు కలిపి సుమారు 200 మందికి పైగా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని, ఇందుకోసం ఇంజినీరింగ్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లను వినియోగించుకుని బ్యాచ్‌ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుట్లు కలెక్టర్ తెలిపారు. డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ వినియోగం, రోగుల వివరాల నమోదు, వైద్య రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ సేవలు, వర్చువల్ కన్సల్టేషన్ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించనున్నారని తెలిపారు.
జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రాజెక్ట్ సంజీవని అమలులో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో డీఎంహెచ్ఓ,డీసీహెచ్ఎస్ జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆర్డీఓ , డీఈఓ ఏపీఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టాటా ఎండీ జిల్లా లీడ్ సభ్యులుగా ఉంటారని, ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడం, వివిధ శాఖల పనితీరును సమన్వయం చేయడం, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుందని కలెక్టర్ తెలియజేసారు.మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం వద్దు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాజెక్ట్ సంజీవని అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో విద్యుత్ సదుపాయం, నిరంతరాయ ఇంటర్నెట్ కనెక్టివిటీ, అవసరమైన సాంకేతిక పరికరాలు, కంప్యూటర్ వ్యవస్థల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. ఏ శాఖ పరిధిలోని పనులు ఆ శాఖ అధికారులు బాధ్యతగా తీసుకుని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
ప్రాజెక్ట్ సంజీవని ద్వారా ప్రభుత్వ వైద్య సేవలను మరింత ప్రజలకు చేరువ చేయడంతోపాటు, ప్రతి పౌరుడికి సమీకృత డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ దిశగా వైద్య, ఆరోగ్య శాఖతోపాటు సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును విజయవంతం చేయాలని డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అమలాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి కే సరళావతి, జిల్లా వైద్యశాఖ అధికారి ఎం దుర్గారావు దొర జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.కార్తీక్, జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ కే శంకర్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బాషా, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ చక్రవర్తి, డిస్టిక్ లీడ్ టాటా ఎండి స్పెషలిస్ట్ ఎమ్మెస్ గోపీచంద్ వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.